Thursday, April 21, 2011

బాబా బందీ

బాబా బందీ
చెర పట్టిన సహాయకులు
మానసిక వేదనలో భగవాన్

మూడు నెలలుగా అన్నం లేదు
ఆరు నెలలుగా మాట్లాడింది లేదు
'భగవాన్'కు గంజిలో నిద్రమాత్రలు
ఆప్తులనూ రానివ్వని సహాయకులు
తనువు చాలించాలన్న వ్యథతో బాబా!
చికిత్స ఒకటి.. చెబుతున్నది మరోటి
ఐసీయూలో వైద్యం తెలియని వ్యక్తి
ఎముకల గూడులో సత్యసాయి
అందుకే బయటికి రాని ఫోటోలు?


ఆయన పాద పద్మాలను ఫొటోల్లో చూసుకుని సైతం తన్మయత్వానికి గురయ్యే అఖిల భక్త జనానికి ఇదో చేదు నిజం... మూడు నెలలుగా 'ప్రత్యక్ష దైవానికి' ప్రత్యక్ష నరకం! ముప్పూటలా పంచభక్ష్యాలు ఆరగిస్తున్న 'జిత్తు'ల మారి సహాయకులు.. మూడు నెలలుగా 'దివ్య పురుషుడికి' ఒక్క ముద్ద అన్నం పెట్టని దైన్యం! గంజిలో నిద్ర మాత్రలు వేసి.. 'దేవుడిని' నిద్రలో ముంచేసిన చిత్రం!

నిత్యం భక్తితత్వం ప్రబోధించే 'భగవాన్'.. ఆరు నెలలుగా బలవంతపు మూగ నోములో బందీ అయిన వైచిత్రి! సత్యజిత్ అనే సహాయకుడి చేతుల్లో సత్యసాయిబాబా బందీ! అసలు ఆయన అనారోగ్యానికి కారణం కూడా ఈ సత్యజిత్తే! ఇది ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పరిశోధనలో వెల్లడైన పచ్చి నిజం! సహాయకుల ముసుగులో బాబాను చెరపట్టిన వైనం ఎప్పటికైనా భక్తులకు తెలియాలనే ఉద్దేశంతో ప్రశాంతి నిలయంలో 1968 నుంచి ఉంటున్న ప్రొ. శ్యాంసుందర్ రాసి పెట్టుకున్న ఒక లేఖను ఆంధ్రజ్యోతి సంపాదించింది.

అవును.. ప్రశాంతి నిలయం.. ఇప్పుడు అశాంతి నిలయమైంది! ప్రేమ భావనలు బోధించిన వేద మూర్తికి.. అది మానసిక వేదన మిగిల్చింది! భక్తితత్వం బోధించిన కాషాయధారికి.. కపట శిష్యగణం ఖైదు విధించింది!! అసలు.. సత్యజిత్ అనే అల్ప జీవి.. సాక్షాత్తూ సత్యసాయినే తన గుప్పిట్లోకి ఎలా తీసుకున్నాడు? దీని వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి?

శ్యాం సుందర్ లేఖలో ఏముందంటే?
...బాబా అందరికీ దేవుడు కావచ్చేమో కానీ తనకు, సత్యజిత్‌కు మాత్రం దేవుడు కాడని శౌరి తరచు అనేవారు. ...ఈ దశలో శౌరి సత్యజిత్‌కు ఒక సలహా ఇచ్చారు. బాబాకు ప్రతిరోజూ రాత్రి నిద్రమాత్రలు ఇచ్చి పడుకోబెట్టేయమని! అప్పట్నుంచి బాబాకు నిద్రమాత్రలు వేయడం మొదలైంది.

...2006లో భగవాన్ బృందావన్ నుంచి తిరిగి వచ్చారు. ఇకపై నిద్ర మాత్రలు వేసుకోనని చెప్పారు. అయితే ప్రశాంతి నిలయం చేరుకున్నాక నిద్రమాత్రలు వేసుకోవడం ప్రారంభించారు. కాలం గడిచేకొద్దీ బాబా కదలికలు మందగించాయి.

...సత్యజిత్ చెప్పేవరకూ ఏ డాక్టరూ బాబా దగ్గరకు రావడానికి వీల్లేదు. స్వామి ఏ సమయంలో దర్శనం ఇవ్వాలో నిర్ణయించేది సత్యజితే. కిందకు తీసుకురావాలా, వద్దా అనేది కూడా ఆయన ఇష్టమే.

...ప్రతి శనివారం లేదా ఆదివారం లేదా సెలవు రోజు ఇద్దరు డాక్టర్లు వచ్చి యజుర్మందిర్‌లో ఉంటారు. కానీ వారు వచ్చేది వైద్యం చేయడానికి కాదు... అర్ధరాత్రి వరకూ సినిమాలు చూస్తూ గడపడానికి.

...గత ఆరు నెలల నుంచీ స్వామి ముఖ పక్షవాతంతో బాధపడడం చూస్తున్నాను. ఆ విషయంలో ఎవరైనా ఏమైనా చేశారా? దాని గురించి ఎవరూ మాట్లాడరు. వారికి ఆ అధికారం లేకపోవడం వల్ల కావచ్చు, లేదంటే సత్యజిత్‌కు భయపడి కావచ్చు.

...భగవాన్ గుండె జబ్బుతో బాధపడుతున్నారనేది ఇప్పుడు అందరికీ తెలిసిన విషయం. ఆ సమస్య కొద్ది రోజుల కిందటే ఏర్పడిందా? లేదంటే చాలా నెలల క్రితం నుంచే ఉందా? చాలా నెలల క్రితం నుంచే ఉందని వైద్య పరీక్షల నివేదికలు చెబుతున్నప్పుడు మరి చికిత్సను ముందుగానే ఎందుకు ప్రారంభించలేదు?

ఇప్పుడైనా నేను నోరు విప్పకపోతే దేవుడు క్షమాంచడు: ఆదికేశవులు
బాబాను నేను కలిసిన సమయంలో ఆయనలో వైరాగ్యం కనిపించింది. కొన్ని రోజులుగా ఆయన మనసు విప్పి మాట్లాడడం లేదు. మూడు నెలలుగా అన్నం ముట్టడం లేదని తెలిసింది. ఈ స్థాయిలో ఆరోగ్యం క్షీణించే దశకు చేరడం వెనుక ట్రస్టు నిర్లక్ష్యం ఉంది. ఈ స్థితిలో కూడా నేను నోరు విప్పి మాట్లాడకపోతే దేవుడు కూడా నన్ను క్షమించడు. అక్కడ చాలా జరుగుతోంది.

స్వామి చిత్ర వధ కంటే ఎక్కువ మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. హెల్త్ బులెటిన్‌ను సైతం ట్రస్టు, ప్రభుత్వ వైద్యులు వేరు వేరుగా ఇస్తున్నారు. లక్షలాది భక్తులు ఆరాధించే దివ్య పురుషుడైన బాబాకు ఈ పరిస్థితి రావడం బాధాకరం. దురదృష్టకరం. ప్రస్తుత పరిస్థితి నన్ను వేధిస్తోంది. దీనిని సహించేది లేదు. సత్యజిత్‌ను విచారించాలి. బాబా ఆరోగ్యం బాగుపడాలి. త్వరలో ఆయన భక్తులకు దివ్యదర్శనం ఇవ్వాలి.
- బాబా భక్తుడు ఆదికేశవులు నాయుడు

హైదరాబాద్, ఏప్రిల్ 14 : కోట్లాది భక్తులకు ప్రత్యక్ష దైవం కొంత కాలంగా ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారా? ఏకుల్లా వచ్చి మేకులైన వారు బాబాను గుప్పిట్లో పెట్టుకొని, నిర్బంధించి, సకాలంలో సరైన వైద్యం అందకుండా చేశారా? ఆస్పత్రిలో చేర్చక ముందు రోజూ బాబా గదికి తాళం వేసి, ఆయనను తీవ్ర మనోవేదనకు, ఆనారోగ్యానికి గురి చేసిన వ్యక్తి.. ఇప్పుడు బాబా చికిత్స పొందుతున్న ఐసీయూలో ఏం చేస్తున్నట్లు?

ప్రభుత్వం పంపిన డాక్టర్లను కాదని, ఇతరులు బాబాకు చేస్తున్న చికిత్స ఏమిటి? బాబాకు గత కొన్ని నెలలుగా వాడిన మందులు ఏంటి? అవి సరైన చికిత్స కోసం వాడినవేనా? వీటన్నింటికీ సమాధానం దొరికితే ప్రశాంతి నిలయంలో సాగుతున్న అశాంతి కార్యకలాపాలు బట్టబయలవుతాయి! వీటిలో కొన్నింటికి 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి' కూపీ లాగింది. విస్తుబోయే విషయాలను బయటకు తీసింది. భక్త కోటి నిర్ఘాంతపోయే నిశీధి నిజాలను తవ్వితీసింది.

బాబాకు సరైన వైద్య చికిత్స అందించాలని రాష్ట్ర మంత్రి గీతారెడ్డి, బాబాకు సన్నిహితులైన టీటీడీ మాజీ చైర్మన్ ఆదికేశవులు నాయుడు వంటివారు ఆరు నెలల కిందటే ఎంత మొత్తుకున్నా.. పరిస్థితి విషమించే వరకు ఉపేక్షించి, బాబాను తీవ్ర ప్రాణాపాయ స్థితిలోకి నెట్టివేశారు. బాబా తొమ్మిదేళ్ల కిందట ప్రమాదవశాత్తూ కింద పడ్డారు. ఆ ఘటనలో ఆయన తుంటి ఎముక దెబ్బతింది.

అప్పటి నుంచి చక్రాల కుర్చీకే పరిమితమయ్యారు. ఆయనకు సపర్యలు చేసే బాధ్యతలు స్వీకరించిన సత్యజిత్ అనే వ్యక్తి ఇపుడు మొత్తం కథ నడిపిస్తున్నారు. 2005 నుంచి బాబాను దాదాపుగా బందీ చేశారు. మొదట్లో ఉన్న పూర్ణచంద్ర హాలు నుంచి యజుర్మందిరంలోకి బాబాను మార్చారు. బాబాను ఎవరూ దర్శించుకోవడానికి వీలు లేకుండా గేట్లకు తాళాలు వేసేవారని తెలియవచ్చింది.

సత్యజిత్ నిర్లక్ష్యం వల్లే!
బాబాకు ఆహారం అందించడంతో పాటు అనేక విషయాల్లో సత్యజిత్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడన్న ఆరోపణ వినిపిస్తోంది. బాబాకు వైద్య పరీక్షలు నిర్వహించాలన్నా సత్యజిత్ అనుమతి ఉండాలన్న రీతిలో వ్యవహారం నడిచినట్టు చెబుతున్నారు. సాయి వ్యవహారాలతో పాటు ఆయన ఆరోగ్య స్థితిగతులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన ట్రస్ట్ వర్గాలు ఆధిపత్య పోరులో మునిగిపోవడం కూడా బాబా ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యానికి కారణమయ్యాయన్న అనుమానాలున్నాయి.

సత్యజిత్ వ్యవహారం కారణంగానే సత్యసాయి నేడు అనారోగ్య పరిస్థితిని ఎదుర్కొంటున్నారన్న వాదన వినిపిస్తోంది. ప్రధానంగా సెంట్రల్ ట్రస్ట్‌లో సభ్యత్వం కావాలని సత్యజిత్ గతంలో డిమాండ్ చేసినట్టు కూడా ఆరోపణలున్నాయి.

సెంట్రల్ ట్రస్ట్‌లో సభ్యత్వం విషయంలో ఇతరులు సత్యజిత్‌ను అడ్డుకున్నట్టు ప్రచారముంది. సాయి ఆరోగ్యం విషయంలో మొదటి నుంచి ఉన్న వారిపై కూడా సత్యజిత్ తన ఆధిపత్యం ప్రదర్శించి ఒక్కొక్కరినీ దూరం చేస్తూ వచ్చారని శ్యాంసుందర్ అనే ప్రొఫెసర్ పేర్కొనడం గమనార్హం. ఇలా ఎవరికి వారు సత్యసాయిపై తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు తీసుకువచ్చి ఆయనను మానసికంగా తీవ్ర క్షోభకు గురి చేసినట్టు ప్రచారముంది.

వైద్య బృందం కోసం పట్టుబట్టిన ఆంతరంగికులు!
అడపాదడపా బాబానే బయటకు వచ్చి భక్తులకు దర్శనమిచ్చి వెళ్లేవారు. బాబా ఆరోగ్య పరిస్థితి క్రమేపీ దెబ్బ తింటున్నట్లు గుర్తించిన ట్రస్టు సభ్యులు, ఆంతరంగికులు, ఆయన చికిత్సను పర్యవేక్షించేందుకు ఒక వైద్యుల కమిటీని నియమించాలని సూచించారు. మంత్రి గీతారెడ్డి కూడా పట్టుపట్టారు కానీ ఏ కారణాల వల్లనో అది ఆచరణలోకి రాలేదు.

గత మూడు నెలలుగా బాబా ఆరోగ్య పరిస్థితిలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. తీవ్రమైన మనోవేదనను, వైరాగ్యాన్ని తన సన్నిహితుల వద్ద వ్యక్తపరిచేవారు. భక్తులకు దర్శనం ఇవ్వడం కూడా తగ్గించేశారు. తన ఆశయం సిద్ధించిందని తనువు చాలిస్తానని కూడా ఆంతరంగికుల వద్ద అనేవారు. దాదాపు మూడు నెలలు మానసికంగా, శారీరకంగాతీవ్ర మనోవేదనను, హింసను అనుభవించారు. ఆయనకు అన్నం పెట్టకుండా కేవలం గంజిలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చేవారని తెలుస్తోంది.

పరిస్థితి చేజారి పోతున్న సమయంలో మార్చి 28న బాబాను ఆస్పత్రికి తరలించారు. కానీ మార్చి 27న బాబా ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించిన ఆయన ఆప్తులకు దిగ్భ్రాంతికర విషయం తెలిసింది. 27వ తేదీన బాబా ఉన్న గదితో పాటు లిఫ్టుకు సైతం తాళాలు వేశారు. అప్పటికే అనారోగ్యంతో ఉన్న బాబాను ఆస్పత్రికి పంపకుండా, సన్నిహితులకు చూపకుండా తాళాలు ఎందుకు వేశారు? ఎవరికీ అంతుపట్టదు! ఇది గడచిన చరిత్ర! బాబాకు జరుగుతున్న వైద్యమేంటి?

మార్చి 28 తర్వాత ఆస్పత్రిలో జరుగుతున్నదేమిటి! ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న! బాబాకు ఒట్టి అనారోగ్యమేనా? ఊపిరితిత్తులు, మూత్రపిండాలు దెబ్బతిన్నాయని, ఇన్ఫెక్షన్ క్రమేపీ తగ్గుతోందని వైద్య నివేదికలు చెబుతున్నాయి. మరి బాబాకు సీటీ స్కాన్ చేసిన విషయాన్ని మాత్రం బయటకు చెప్పడం లేదు. ఐసీయులోకి ప్రభుత్వ వైద్యుల బృందాన్ని అనుమతించడంలేదు.

బాబాకు గత కొన్ని నెలలుగా వాడిన మందుల వివరాలన్నీ వైద్య విభాగం డైరెక్టర్ రవిరాజ్ దగ్గర ఉన్నాయి. కానీ భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి... గొడవల చెలరేగుతాయి.. అనే భావంతో ఆ విషయాలను బయటపెట్టడం లేదు. లోపలి అవయవాలతో పాటు శరీరంపైన కూడా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? అన్నది వైద్యులు తేల్చాల్సి ఉంది. అదే సమయంలో చికిత్స పొందుతున్న బాబాను ఎందుకు చూపించడం లేదన్నది మరో ప్రశ్న. తీవ్ర అనారోగ్యానికి గురైన బాబా.. ఎముకల గూడుగా మారిపోయారని, అందుకే ఆయన వీడియో క్లిప్పింగ్‌ను గానీ, కనీసం ఫొటోను గానీ బయటికి రానీయడం లేదన్న వాదన కూడా వినిపిస్తోంది.

ఆస్పత్రిలో వైద్యుల కంటే వైద్యం తెలియనివారే ఎక్కువగా ఉండటం విశేషం. ఐసీయూను తన కంట్రోల్‌లో ఉంచుకున్న కార్డియాలజిస్ట్ అయ్యర్ కూడా ఈ మొత్తం వ్యవహారంలో కీలక పాత్రధారిగా ఉన్నారని తెలుస్తోంది. సాధారణంగా ఐసీయూలో ఉన్న పేషెంట్‌ను అత్యవసరమైతే గానీ కదపరు. అటువంటిది... సత్యసాయిని పిల్లి.. పిల్లలను మార్చినట్లు ఒక ఫ్లోర్ నుంచి మరో ఫ్లోర్‌కు తెగ తిప్పేస్తున్నారు. 18 రకాల యాంటీబయాటిక్స్‌ను ఆయన శరీరంలోకి పంపుతున్నారు. ఇదంతా బయటి ప్రపంచానికి తెలియనివ్వడం లేదు.

సత్యసాయి బందీగా మారిన పరిస్థితి ఈనాటిది కాదు. ఒక్క రోజులో జరిగిన పరిణామమూ కాదు. ఏళ్ల తరబడి కొందరి చేతుల్లో చిక్కుకుపోయిన సత్యసాయి.. శారీరకంగా దుర్భలుడిగా మారుతున్న కొద్దీ ఆ దుర్మార్గులు విజృంభించారు. ఈ విషయాన్ని సాయికి అత్యంత సన్నిహితంగా ఉండే పలువురు ముందుగానే సర్కారు చెవిన వేసినా ఫలితం లేకపోయింది. ఇదంతా ఎందుకు జరుగుతోంది.

ఎందుకింత రహస్యం పాటిస్తున్నారు? ఏమిటీ దాగుడు మూతలు? త్వరలో ఈ గుట్టూ రట్టు కాక మానదు! ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని పలువురు భక్తులు కోరుతున్నారు. సత్యజిత్ సహా ట్రస్ట్‌లోని ముఖ్యులను సైతం ప్రభుత్వం విచారించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే.. ఇంతటి సాహసానికి ప్రభుత్వం పూనుకుంటుందా? అనేది మాత్రం ప్రశ్నార్థకమే!!

0 comments:

Post a Comment